జూబ్లీహిల్స్, వెలుగు: అధిక రాబడి ఆశచూపి రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టించి, అందులో రూ.30 లక్షలు కాజేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెస్సర్స్ గ్రోవ్‌క్యాప్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామి ఎల్లారెడ్డిగూడకు చెందిన ఐనంపూడి వినోద్ గోపాల్ కృష్ణ వర్మకు శ్రీకర్ రెడ్డి వాకిటి అనే వ్యక్తి 55 రోజుల్లో అధిక రాబడి అందిస్తామని హామీ ఇచ్చి, అతనితోపాటు, సహచరులు ఆరుగురిని రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించాడు.
పెట్టుబడి పెట్టిన అనంతరం శ్రీకర్‌రెడ్డి రూ.30 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాడు. మిగతా రూ.30 లక్షలు, వడ్డీ రూ.12 లక్షలు.. మొత్తం రూ.42 లక్షలు చెల్లించాల్సి ఉండగా మోసం చేశాడు. అంతేకాకుండా అతను అనధికారిక సంస్థను నిర్వహిస్తూ, అధిక రాబడులు ఇస్తానని హామీ ఇచ్చి పలువురి నుంచి పెట్టుబడులు సేకరిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
